అభివృద్ధి పనులు ఆకర్షణీయంగా చేపట్టాలి
ములుగు రూరల్: జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆకర్షణీయంగా చేపట్టాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. ములుగు మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట, ఇంచర్ల ఏకో పార్క్ అభివృద్ది పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. ముందుగా దేవునిగుట్ట్ట లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఇంచర్ల ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏకో పార్క్, వాచ్ టవర్, నీటికుంటలను పరిశీలించారు. వెదురు బొమ్మల తయారీదారులతో మాట్లాడారు. చేతివృత్తిదారులు వెదురు బొమ్మల తయారీతో ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్ ప్రభాకర్, సీసీఎఫ్ కాళేశ్వరన్, ములుగు, భూపాలపల్లి డీఎఫ్‌ఓలు రాహుల్ కిషన్ జా దవ్, నవీన్‌రెడ్డి, పారెస్టు డివిజనల్ ఆఫీసర్లు, ఎఫ్‌ఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్‌రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
మల్హర్: ఓపెన్ కాస్ట్‌లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ మైన్‌ను వెంకట్వేర్‌రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్‌కాస్ట్ మైన్‌గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఓపీ, సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్ ఏజెంట్ జీవన్‌కుమార్, సభ్యులు జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్‌కో జీఎం మోహన్‌రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, కేఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేప్టీ అధికారి సురేష్‌బాబు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ఆకర్షణీయంగా చేపట్టాలి


