ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, ఐఏఎస్ ఫణింద్రరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఏర్పాటుచేసిన గణాంక పర్యవేక్షణ బృందం కేంద్రాన్ని సందర్శించారు. ఆ బృంద సభ్యులతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాహనాలలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కలిగి ఉండి సరైన సాక్షాలు లేకుండా డబ్బులు ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు సీజ్ చేయాలని ఆదేశించారు. మెట్‌పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులు, తాగునీరు, కరెంటు, మూత్రశాల వసతులు తప్పకుండా ఉండాలని పంచాయతీ కార్యదర్శి మంజూర్‌కు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ప్రతీ ఒక్కరు పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్రనాథ్, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.
ఎలక్షన్ అబ్జర్వర్ ఫణింద్రరెడ్డి
అంతర్రాష్ట్ర వంతెన చెక్‌పోస్టు పరిశీలన


