ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
వెంకటాపురం(కె)/ కన్నాయిగూడెం: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మూడో విడతలో 46 సర్పంచ్ స్థానాలు, 408 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వెంకటాపురం (కె) మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు 103 నామినేషన్లు దాఖలయ్యాయి. వాజేడు మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 85, కన్నాయిగూడెం మండలంలో 11 సర్పంచ్ స్థానాలు, 90 స్థానాలకు దాఖలైన నామినేషన్ల పూర్తి వివరాలు శుక్రవారం అర్థరాత్రి వరకు అందలేదు. వెంకటాపురం(కె) 166 వార్డు స్థానాలకు 405 నామినేషన్లు దాఖలయ్యాయి. వాజేడులో 152 స్థానాలకు 373 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ సర్పంచ్ స్థానంతోపాటు, మొత్తం ఎనిమిది వార్డు స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ముప్పనపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వు కాగా.. గ్రామానికి చెందిన తిప్పనపల్లి లక్ష్మయ్య మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ గ్రామంలో కేవలం రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. వారిలోకూడా ఎవరైనా ఉపసంహరించుకుని మొత్తానికి ఏకగ్రీవం చేస్తారా.. వేచిచూడాలి.
ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ


