‘నిధి’ కొందరికే..
29,955 మందికి మాత్రమే
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం
వ్యవసాయ భూమికి పట్టాలు పొందిన ప్రతి రైతుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అవకాశం కల్పించారు. నూతనంగా పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు అవకాశం కల్పించాలి. పలువురు రైతులు పట్టాలు ఉన్నా.. పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు.
– ఒజ్జల కుమారస్వామి, రైతు, ములుగు
పీఎం కిసాన్ సమ్మాన్ నిథి పథకానికి ప్రభుత్వం కటాఫ్ విధించింది. 2019 కంటే ముందు పట్టాలు పొందిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వారికి పెట్టుబడి సాయం అందుతుంది. కటాఫ్ తేదీ తర్వాత పట్టాలు పొందిన వారికి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
– సురేష్‌కుమార్, డీఏఓ
●
ములుగు రూరల్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫలితం జిల్లాలో కొంత మంది రైతులకు మాత్రమే అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 2019 ఫిబ్రవరి 01వ తేదీ వరకు పట్టాలు కలిగి ఉన్న రైతుల నుంచి మాత్రమే అప్పట్లో దరఖాస్తులు తీసుకుంది. ఆ తర్వాత పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో వారంతా ఈ పథకానికి దూరమయ్యారు. అయితే ఆ తర్వాత వారసత్వం ద్వారా భూములు పొందిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
ఆరేళ్లుగా నిరీక్షణ..
ప్రభుత్వం ప్రకటించిన కటాప్ తేదీ తర్వాత భూ పట్టాలు పొందిన రైతులకు పీఎం కిసాన్ నిధికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో పట్టాలు కలిగిన రైతులు 86,736 మంది ఉన్నారు. ఇందులో 29,955 మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ అవుతున్నాయి. ఆరు సంవత్సరాలుగా పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడంతో పెట్టుబడి సాయం అందక రైతులు నష్టపోతున్నా రు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాలుగా రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
నిబంధనల వర్తింపు..
రైతులకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం సాయం అందించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టింది. పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులను గుర్తించి ఆర్థికసాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పథకానికి అనర్హులు. కుటుంబ సభ్యులకు వేర్వేరుగా భూమలు ఉన్నా.. ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఆదాయపు పన్ను, విదేశాల్లో నివాసం ఉండే వారికి పథకం వర్తించదు. ఇప్పటి వరకు 20 విడతల్లో లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం పథకంలో చేస్తున్న మార్పుల కారణంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది.
మొత్తం పట్టాదారులు 86,763 మంది
2019కి ముందు పట్టాలు పొందిన
రైతులకే నగదు జమ
ఆరు సంవత్సరాలుగా
పట్టాదారుల ఎదురుచూపు
‘నిధి’ కొందరికే..
‘నిధి’ కొందరికే..


