ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో సాధారణ పరిశీలకుడు (ఎన్నికలు) ప్రశాంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయిల్ ఫెడ్, హైదరాబాద్, అదనపు కలెక్టర్ సంపత్ రావు తదితరులో కలిసి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్.. మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సుల అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. మొదటి దశ పోలింగ్‌కు కావాల్సిన బ్యాలెట్ పత్రాలను సంబంధిత ఎంపీడీఓలకు అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిపుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, సర్వీస్ ఓటర్లు, టీ పోల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


