ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా?
మంగపేట: అసలే మూలమలుపు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం కష్టం.. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు అడుగడుగునా ప్రమాద కరంగా మారింది. అయినా సంబంధిత ఆర్‌ఆండ్‌బీ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కమలాపురం నుంచి జిల్లా సరిహద్దులోని బ్రాహ్మణపల్లి వరకు గల ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు ఇసుక లారీల దాటికి గోతులమయంగా మారి ప్రమాదకరంగా మారిపోయింది. ప్రధానంగా చుంచుపల్లి పీహెచ్‌సీ ఎదుట మూలమలుపు వద్ద రోడ్డు మధ్యలో నాలుగు మీటర్ల వెడల్పు రెండు ఫీట్ల గొయ్యి ఏర్పడటంతో అందులో జనావాసాల నుంచి వచ్చే మురుగు నీరు నిలిచింది. దీంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. మూలమలుపు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు అతి దగ్గరకు వచ్చే వరకు కనిపించని పరిస్థితి ఉంది. ఏమాత్రం వాహనం అదుపుతప్పినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 2022లో ఇదే ప్రదేశంలో కలప లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పీహెచ్‌సీలోకి దూసుకెళ్లే క్రమంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. చుంచుపల్లితో పాటు కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, పాలాయగూడెం తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు గుంతలమయం
చుంచుపల్లి పీహెచ్‌సీ ఎదుట
మూలమలుపు వద్ద రెండు ఫీట్ల గొయ్యి


