వామ్మో.. చలి
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఏటూరునాగారం: వానాకాలం ముగియగానే.. జనాన్ని చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి వీస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వెచ్చటి వస్త్రాలు, దుప్పట్లు కప్పుకొని ముసుగు తీయని పరిస్థితి నెలకొంది. చలి ఎక్కువగా ఉండడంతో గ్రామాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళలలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచించడంతో జనం మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత్తలు పడిపోయాయి. ములుగు జిల్లాలో తీవ్రత మరింత పెరిగింది. గోదావరి, దట్టమైన అటవీ ప్రాంతం కావడం ఉదయం పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసుకునే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఈనెల 7వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతోండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
పలు అనారోగ్య సమస్యలు
చలి తీవ్రత వల్ల సీజనల్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందని, జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రులకు వెళ్లడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
బయటకు వెళ్లలేకపోతున్న వృద్ధులు, చిన్నారులు
ఉదయం ఇబ్బందిపెడుతున్న పొగమంచు
సాయంత్రం నుంచే మొదలవుతున్న చలి
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
వామ్మో.. చలి
వామ్మో.. చలి


