మార్చి ముహూర్తం కుదిరేనా? | - | Sakshi
Sakshi News home page

మార్చి ముహూర్తం కుదిరేనా?

Nov 15 2025 7:41 AM | Updated on Nov 15 2025 7:41 AM

మార్చి ముహూర్తం కుదిరేనా?

మార్చి ముహూర్తం కుదిరేనా?

ఎంజీఎంకు ‘సూపర్‌’ దెబ్బ

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల్లో లేని వేగం

సాక్షి, వరంగల్‌: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పినా.. పనుల్లో వేగం లేకపోవడంతో 2024 మార్చిలో ప్రారంభిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆస్పత్రి డిజైన్‌ మార్పు, వ్యయం అంచనాపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణతో కొద్దిరోజులు పనులకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత మళ్లీ పనులు ప్రారంభమైనా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమీక్ష సమావేశాల్లో చెప్పినా.. కార్యరూపం దాల్చలేదు. తాజాగా రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకుడు డాక్టర్‌ నరేంద్రకుమార్‌ మార్చిలో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇలా పలుదఫాలుగా వాయిదా పడుతున్న ఈ ఆస్పత్రి ప్రారంభ ముహూర్తం మార్చిలోనైనా కుదురుతుందా లేదా మళ్లీ యథాలాపంగా వాయిదా పడుతుందా? అన్న చర్చ వరంగల్‌వాసుల్లో జరుగుతోంది.

నాలుగేళ్లుగా నాన్చుతూ...

వరంగల్‌లోని సెంట్రల్‌ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్‌ సర్వీసులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021జూన్‌లో ప్రారంభమయ్యాయి. మొదట పనులు వేగిరంగానే జరిగినా, 2022లో డిజైన్‌ మార్చి అంచనా వ్యయం పెంచి పనులు తిరిగి మొదలు పెట్టడంలో జాప్యం చేశారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వం మారడంతో మరింత ఆలస్యమైంది. డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ, తదితర కారణాలతో ఆగుతూ.. సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో వరంగల్‌కు వచ్చిన సమయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణం 84 శాతం పూర్తయ్యిందని, 16 శాతం పూర్తి చేసేందుకు ఇంకెన్ని నెలల సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇటీవల వరంగల్‌లో పర్యటన సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వ కుంట్ల కవిత.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందని, అవకతవకలు జరిగాయనడంతో ఈ ఆస్పత్రి మరోసారి తెరమీదకు వచ్చింది. కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలోనే ఈ ఏడాది డిసెంబర్‌ వరకు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా.. ఇప్పుడు ఆ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు మారింది. మరో నాలుగు నెలల్లోనైనా ఈ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తే పేదలకు వరంగా మారనుంది. ఈ ఎంజీఎంలోని 1500 పడకల ఆస్పత్రి అక్కడికి తరలడం ద్వారా, అక్కడా మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటు వల్ల 2వేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్‌కు రెఫరల్‌ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందే అవకాశముంది. అవయవ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే జరగనున్నాయి.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రిని అక్కడికి తరలిస్తారన్న ఉద్దేశంతో ఎంజీఎంలో సివిల్‌వర్క్‌లు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని వైద్యపరికరాలను కూడా సమకూర్చడం లేదని సమాచారం. దీనికితోడు పాలన అస్తవ్యస్తంగా మారి, కుంభకోణాలకు నెలవుగా మారింది. రోగులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వివాదంలో పాత సూపరింటెండెంట్‌ మారి కొత్తగా డాక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి వచ్చారు. ఈయన వచ్చాక ఎంజీఎంలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణలు జరుగుతున్నాయి. ఇంకోవైపు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిద్దామనుకున్నా సరైన వనరులు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతమేర వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే కార్పొరేట్‌ వైద్యం పేదలకు అందే అవకాశముంది.

నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని డీఎంఈ ప్రకటన

క్షేత్రస్థాయిలో ఆశించని మేరకు

సాగని పనులు

నాలుగున్నరేళ్లుగా ఊరిస్తున్న వైద్యసేవలు అందుబాటులోకి వస్తే ప్రయోజనమే

ఎంజీఎంను తరలిస్తారన్న

సమాచారంతో ఇక్కడా నిర్లక్ష్యం

సివిల్‌ వర్క్‌లు చేయకుండా

తాత్సారంతో రోగుల ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement