స్లో
మహాజాతర పనులు
మేడారంలో నెమ్మదిగా గద్దెల ప్రహరీ నిర్మాణం
ప్రహరీ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర జాతర అభివృద్ధి పనులు ముందుకు.. వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు సాగనుండడంతో సమయం దగ్గర పడుతున్న తరుణంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నా పనులు మాత్రం నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. మంత్రులు ఆదేశించినా పనుల్లో ఆలస్యం చోటు చేసుకుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
రోడ్డు పనులకు అడ్డంకులు
మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్ ఊరు పొలిమేరల నుంచి ఊరట్టం స్తూపం వరకు రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. మేడారం గ్రామం నుంచి మొదలుకుని ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వరకు రోడ్ల విస్తరణ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్రామస్తుల ఇళ్ల ఎదుట స్థలం రోడ్డు విస్తరణలో కొంతమేరపోతుండడంతో గ్రామస్తులు పనులకు అడ్డుపడుతున్నారు. అడ్డంకులు లేని ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. అడ్డంకులతో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నెమ్మదిగా గద్దెల ప్రహరీ పనులు
మేడారం గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 90 రోజుల్లో ప్రహరీ నిర్మాణం పనులు పూర్తి చేయాలని మంత్రులు సమీక్ష సమావేశాల్లో అధికారులను ఆదేశించినా పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. అనుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేందుకు రాత్రింభవళ్లు కార్మికులతో పనులను చేయిస్తున్నారు. మహాజాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనుకున్న లక్ష్యం మేరకు అధికారులు పనులను పూర్తి చేసేందుకు మేడారంలో తిష్ట వేసి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
డ్రెయినేజీ పనులు నామమాత్రమే..
మేడారం కాలనీలో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల ఎదుట స్థలం కోల్పోతుండడంతో డ్రెయినేజీ నిర్మాణం పనులకు అడ్డుతగులుతున్నారు. దీంతో కొంత మేర పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. అడ్డంకులు లేని చోట చకచకా సాగుతున్నాయి. అంతేకాకుండా రెడ్డిగూడెంలో రూ.70 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం పనులు పొందిన కాంట్రాక్టర్ నేటి వరకు పనులు ప్రారంభింకపోవడం గ్రామస్తుల అడ్డంకులే కారణమని అధికారులు చెబుతున్నారు.
రోడ్ల విస్తరణకు అడ్డంకులు
ముందుకుసాగని డ్రెయినేజీ పనులు
స్లో
స్లో


