నేటి నుంచి జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
ములుగు రూరల్: జిల్లాలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేటి నుంచి జోనల్ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు డీసీఓ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురుకుల పాఠశాలలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి కృష్ణాదిత్య ఆదేశాల మేరకు 2025–26 జోనల్ స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జోన్–1 కాళేశ్వరం నుంచి ఐదు జిల్లాలకు చెందిన 11 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాల నుంచి 85 మంది చొప్పున విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటారని వివరించారు. అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు భోజనం, వసతి ఏర్పాటు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా డీసీఓ గోల్కొండ భిక్షపతి, క్రీడా పోటీల ఇన్‌చార్జ్ వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


