ప్రహరీ పనుల్లో ఆలస్యం చేయొద్దు
మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మాణం పనుల్లో ఆలస్యం చేయొద్దని ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇన్ ఇంజనీరింగ్ మోహన్‌నాయక్ అన్నారు. మేడారంలోని కొనసాగుతున్న ప్రహరీ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లర్ల నిర్మాణం పనులు ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదనే విషయం తెలుపగా రేపటి వరకు 6ఫీట్ల పిల్లర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పిల్లర్ల పనులు పూర్తయితేనే స్టోన్స్ పనులు చేపడుతారని వివరించారు. సాలహారం నిర్మాణం పనుల్లో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని సూచించారు.కొలతలు సరిగా ఉన్నాయా లేదా అని టేపుతో కొలిచి చూశారు. స్టోన్స్ ఏర్పాటు, పిలర్ల నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సమన్వయంతో పనులు చేయాలన్నారు, స్టోన్స్ ఏర్పాటులో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అందుకోసం ప్రత్యేకంగా ఇద్దరి స్థపతులను నియమించినట్లు తెలిపారు. వారి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకున్న ఆయన తాడ్వాయి– మేడారం మార్గంలోని డిప్పుల పైపులైన్ కల్వర్టు నిర్మాణం పనులను పరిశీలించారు. డిప్పుల ఎత్తు సమాంతరంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు, పనుల్లో తేడా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


