రేపటి నుంచి ఎన్‌హెచ్‌పై రాకపోకల నిలిపివేత
ములుగు రూరల్: మల్లంపల్లి నుంచి ఏటూరునాగారం వెళ్లే జాతీయ రహదారిని తాత్కాలికంగా రేపటి(6వ తేదీ) నుంచి మూసి వేస్తున్నట్లు నేషనల్ హైవే ఏఈ చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌పై బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నూతనంగా చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం కలగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ములుగు నుంచి వచ్చే భారీ వాహనాలను అబ్బాపూర్ మీదుగా, చిన్న వాహనాలను భూపాల్‌నగర్ మీదుగా హనుమకొండకు చేరుకోవాలని సూచించారు. హనుమకొండ నుంచి ములుగు వైపు వచ్చే భారీ వాహనాలు వయా పరకాల మీదుగా, చిన్న వాహనాలు శ్రీనగర్ మీదుగా ములుగు చేరుకోవాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.


