నేడు కార్తీక పౌర్ణమి
వెంకటాపురం(ఎం): కార్తీక మాసం పరమ పవిత్రం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత నెలకొంది. ఈ మాసంలో ప్రతిరోజూ భక్తులు పరమశివుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలు దీపాలకాంతులు, శివనామస్మరణతో మార్మోగనున్నాయి. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ దీపాలు వెలిగిస్తారు. సహజంగా ప్రతీ శుక్రవారం మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కార్తీక మాసంలో ప్రతిరోజూ లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలో మహిళలు నేడు బుధవారం కార్తీక పౌర్ణమి రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తులసి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. ఈ మేరకు ఆలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.
రామప్పకు పోటెత్తనున్న భక్తులు
కార్తీక పౌర్ణమి రోజున భక్తులతో రామప్ప ఆలయం కిటకిటలాడనుంది. జిల్లాలో ప్రధానంగా శివరాధనకు రామప్ప దేవాలయానికి పెట్టింది పేరు. భక్తులు కుటుంబసమేతంగా ఉదయం 5 గంటల నుంచే రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వరస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలోని మారేడు చెట్టుతో పాటు మామిడి చెట్టు కింద 365 వత్తులు వెలిగించి దీపారాధన చేస్తారు. రామప్ప ఆలయ ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బుధవారం రామప్ప ఆలయం దీపారాధన, శివనామస్మరణతో మార్మోగనుంది.
భక్తులతో కిటకిటలాడనున్న
శివాలయాలు
రామప్ప ఆలయానికి పోటెత్తనున్న భక్తులు


