ముసురుకున్న మోంథా
ఈదురుగాలుల బీభత్సం
ములుగు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో ముసురు పట్టింది. బుధవారం ఉదయం నుంచే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండడంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. కోతకొచ్చిన వరిపంట నేలవాలడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రతి ఏటా నష్టపోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా మేడారం, మల్లంపల్లి, ములుగు, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాల్లో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
మోంథా తుపాను కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, డీఆర్‌డీఓ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నేలవాలిన వరిచేలు..
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మల్లాపురం, చొక్కాల, నూగరు, కర్రవానిగుంపు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి వరిచేలు నేలవాలాయి. కోత దశకు వచ్చిన పంట నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు కోసే సమయంలో ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జాతర పనులకు ఆటంకం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వర్షంతో మేడారం జాతర అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పనులు నిలిచిపోయాయి. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం(ప్రహరీ), మేడారంలో రోడ్ల విస్తరణ, డ్రైయినేజీ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. వర్షం ఇలాగే మరో రెండురోజులు పడితే జాతర అభివృద్ధి పనులు నిచిపోయి పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
ఈదురుగాలులతో నేలవాలిన వరిచేలు
పలుచోట్ల కూలిన చెట్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
మంగపేట : మండల పరిధిలోని కమలాపురం, కోమటిపల్లి, తిమ్మంపేట, రాజుపేట, నర్సింహాసాగర్ తదితర గ్రామాల్లో కోతదశకు వచ్చిన వందలాది ఎకరాల్లోని వరిచేలు నేలవాలాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకూలగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై సూరి వివిధ గ్రామాల్లో పర్యటించి తుపాను తీవ్రతను పరిశీలించారు. వాడగూడెం, బోరునర్సాపురం సమీపంలో చెట్లు కూలి ప్రధాన రహదారిపై పడడంతో తొలగించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.
ముసురుకున్న మోంథా
ముసురుకున్న మోంథా
ముసురుకున్న మోంథా
ముసురుకున్న మోంథా


