ఉచిత కంటి వైద్యశిబిరం అభినందనీయం
ఏటూరునాగారం: సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ శబరీశ్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో వారం రోజులుగా నడుస్తున్న ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరానికి గురువారం ఎస్పీ హాజరై రోగులను పరామర్శించి మాట్లాడారు. ఈ రోజుల్లో డబ్బు సంపాధించిన వారు స్వార్ధకోసం ఆలోచించి జీవించడం తప్పా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. సినీ హీరో సంజోష్ పేద ప్రజలకు సేవచేయడానికి ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది నిరుపేదలకు లాభం జరిగిందన్నారు. వీరికి సహకరించిన శంకర కంటి ఆస్పత్రి సిబ్బందిని ప్రశంసించారు. సంజోష్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వెయ్యి మందికిపైగా పరీక్షలు చేసి 168 మందికి శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అందులో 77 మందికి శస్త్ర చికిత్సలు చేసినట్లు వివరించారు. అనంతరం శంకర నేత్రాలయ వైద్యులను ఎస్పీ శాలువాతో సన్మానించారు. పది రోజులుగా రోగులకు సేవలందించిన ఆశ కార్యకర్తలకు ఫౌండేషన్ తరఫున రూ.15వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్, వైద్యులు పాల్గొన్నారు.
ఎస్పీ శబరీశ్


