
భక్తుల భద్రతకు భరోసా..!
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల భద్రతకు పోలీసులు చర్యలు చేపట్టారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించే క్రమంలో భక్తులకు లోతు అంచనా తెలియక ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతై మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలా మంది భక్తులు జంపన్నవాగులో నీరు ఎక్కువగా ఉన్న చోట భక్తులు స్నానాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో నీటి మడుగుల లోతు అంచనాలు తెలియక గల్లంతై మృత్యువాత పడుతున్నారు.
రెండు నెలల్లో ఇద్దరి మృత్యువాత
జంపన్నవాగులో రెండు నెలల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. గత నెల 7న మేడారం దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన కనిగంటి మనీశ్ స్నానం ఆచరిస్తుండగా వాగులో గల్లంతై మృతి చెందాడు. తాజాగా భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంకు చెందిన దానూరి సాయిగౌతమ్ మేడారానికి వచ్చి ఊరట్టం కాజ్‌వే వద్ద జంపన్నాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గతేడాది కూడా జంపన్నవాగులో భక్తులు గల్లంతై మృతి చెందిన ఘటనలు ఉన్నాయి.
ఎనిమిది ప్రాంతాల్లో బోర్డులు
జంపన్నవాగు వద్ద భక్తుల ప్రమాదాల నివారణకు పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఊరట్టం కాజ్‌వే, రెడ్డిగూడెం, గుండ్ల మడుగుతో పాటు నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ఎనిమిది ప్రాంతాలను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి గుర్తించారు. ఈ మేరకు వాగులో స్నానాలు ఆచరించే భక్తులకు సూచికగా ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. లోతుగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేయొద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులో ముద్రించారు. అంతేకాకుండా వాగులో గల్లంతై మృతి చెందిన భక్తుల ఫొటోలను కూడా హెచ్చరిక బోర్డు ఫ్లెక్సీలలో ముద్రించారు.
జంపన్నవాగులో లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో భక్తులు స్నానాలు చేయడం ప్రమాదాలకు దారి తీస్తుంది. భక్తులు ఎవరూ కూడా హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాగులో పుణ్యస్నానాలు చేయొద్దు. ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు జంపన్నాగులో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. భక్తులు సురక్షితమైన ప్రాంతంలో స్నానాలు చేయాలి.
– శ్రీకాంత్‌రెడ్డి, తాడ్వాయి ఎస్సై
జంపన్నవాగు వద్ద ప్రమాదాల
నివారణకు చర్యలు
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

భక్తుల భద్రతకు భరోసా..!

భక్తుల భద్రతకు భరోసా..!