
సస్యరక్షణ చర్యలు పాటించాలి
వెంకటాపురం(కె) : పంటల సంరక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ విజయభాస్కర్, శాస్త్రవేత్తలు రాజ్‌కుమార్, సౌందర్యలు అన్నారు. మండల పరిధిలోని బెస్తగూడెం, నూగూరు గ్రామాల్లో బుధవారం శాస్త్రవేత్తలు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో డబ్ల్యూజిల్ –962 రకాన్ని పరిశీలించారు. వరి కంకి పాలు పోసుకోవటం, గింజ నిండే దశలో ఉండడం వల్ల కంకినల్లి, గింజమచ్చ వస్తుందని గమనించినట్లు తెలిపారు. దాని నివారణకు లీటర్ నీటికి స్పెరైమెసిన్ 1 మిల్లీ లీటర్, ప్రాపికోనజల్ 1 మిల్లీ టీటర్ నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. మిర్చి పంటను వేరుకుల్లు, ఆకుముడత తెగుళ్లు ఆశిస్తున్నాయని వాటి నివారణకు లీటర్ నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాముల చొప్పున కలిసి పిచికారీ చేయాలన్నారు. అనంతరం రైతులకు పలు అంశాలపై సూచనలు సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్, ఏఈవో శ్యామ్ తదితరులు ఉన్నారు.
రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన