
కాకతీయుల కళావైభవానికి నిదర్శనం రామప్ప
ములుగు: కాకతీయుల కళావైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప అని ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ కన్నా అన్నారు. కాకతీయుల కళా సంపదను వీక్షించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అరవింద్‌కుమార్, విశ్వజిత్ కన్నా దంపతులు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వారి గోత్రనామాలతో రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. గైడ్ విజయ్‌కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, శిల్పకళ సంపద విశిష్టతను వారికి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకతీయుల చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలను ఆనాటి వైభవాన్ని శిల్పకళ నైపుణ్యంతో కళ్లకు కట్టినట్లుగా చెక్కారని కొనియాడారు. అందుకే ఈ అద్బుతమైన కట్టడానికి యునెస్కో గౌరవం దక్కిందన్నారు. రాతిపై చెక్కిన ఇక్కడి శిల్పాల్లో జీవకళ ఉట్టి పడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతిహాసాలు, చరిత్ర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. జీవకళ ఉట్టిపడే శిల్ప కళాకృతుల సౌందర్యానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందేనని కితాబిచ్చారు. రాతి స్తంభాలకు సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషమన్నారు. ఆలయం అంతటా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడి(శివలింగం) వద్ద వెలుతురు ఉంటుందని గైడ్ వివరించారని వెల్లడించారు. అనంతరం వారు సమీపంలోని రామప్ప చెరువులో బోటులో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డీఈ సదానందం, భాస్కర్, ఎస్. కల్యాణ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్లు
అరవింద్‌కుమార్, విశ్వజిత్ కన్నా

కాకతీయుల కళావైభవానికి నిదర్శనం రామప్ప