
దామెరకుంట గురుకులంలో విచారణ
కాటారం: మండల పరిధిలోని దామెరకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు గాయాలైన ఘటనపై బుధవారం సాంఘిక సంక్షేమ గురుకులాల డిస్ట్రిక్ కోఆర్డినేటర్ (డీసీఓ) భిక్షపతి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటన జరిగే ముందు విద్యార్థుల మధ్య ఏదైన గొడవ జరిగిందా, ఉపాధ్యాయుల మధ్య ఏమైన విభేదాలు జరుగుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు గాయాలైన సంఘటన వారి తల్లిదండ్రులకు ఎందుకు తెలియపర్చలేదని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను డీసీఓ ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, వారి మధ్య విభేదాలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయాలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఇదిలాఉండగా విద్యార్థులకు గాయాలైన సంఘటనలో పాఠశాల సిబ్బంది ఓ విద్యార్థినిని మందలించడంతో సదరు విద్యార్థిని సైతం గాయపర్చుకున్నట్లు తెలిసింది. డీసీఓ వెంట పాఠశాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ ఉన్నారు.
ఉపాధ్యాయుల, సిబ్బంది అత్యుత్సాహం
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంత పెద్ద ఘటనలు జరిగినప్పటికీ అవి తల్లిదండ్రుల వరకు చేరకుండా విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తూ దాచిపెడుతున్నారు. దామెరకుంట సాంఘిక సంక్షేమ పాఠశాలలో గతంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగినా సిబ్బంది బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. వారి నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పలుమార్లు ఫోన్ చేసిన హౌస్ మేడమ్స్, ఉపాధ్యాయులు ఏ మాత్రం స్పందించరని ఆందోళన చెంది పాఠశాలకు వస్తే అడ్డగోలు నిబంధనలతో తమను లోనికి అనుమతించరని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పాఠశాల నిర్వాహణపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన!