
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
● మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి
ములుగు రూరల్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ మార్కెట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, మ్యాచ్చర్ మిషన్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాని ప్రకారం గన్నీ బ్యాగుల సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు కాంటాలు, తదితర మిషన్లు అందించామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, పాలకవర్గం సభ్యులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.