
ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
● కేజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్యగౌడ్
ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల పరిధి లోని పలు గ్రామాల్లో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం 68వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన కార్మికులకు పింఛన్లు, ద్విచక్రవాహనాలు, సొసైటీలకు 10 ఎకరాల భూమి, ఏజెన్సీ గీత సొసైటీల పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గీత కార్మికులకు సేఫ్టీ మోకులను అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో సర్ధార్ పాపన్న కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుండబోయిన రవిగౌడ్, బుర్ర శ్రీనివాస్, సారయ్య, ఐలుమల్లు, బాబు, మల్లికార్జున్, సత్యనారాయణ, నవీన్‌గౌడ్, శంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.