
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు రూరల్: జిల్లాలో ఎంపీటీసీ. జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగపేట మండలంలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిపివేసినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడుతలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 9 మండలాలలో 146 పంచాయతీలు, 1,290 వార్డులు, 87 షెడ్యూల్డ్, 59 నాన్ షెడ్యూల్డ్ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,306 పోలింగ్ స్టేషన్లు, 217 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 10 జెడ్పీటీసీ స్థానాలకు 3 ఎస్టీ, 2 ఎస్సీ, 4 బీసీ, 1 జనరల్‌కు, అలాగే 69 ఎంపీటీసీ స్థానాలలో సైతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. జూలై 10 వరకు నమోదైన ఓట్లలో పురుషులు 1,10,838 మంది ఉండగా మహిళలు 1,18,299, ఇతరులు 22 మంది ఉన్నారన్నారు. షెడ్యూల్‌కు అనుకులంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వసతుల కల్పనపై దృష్టి సారిస్తారని, పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించనున్నట్లు వివరించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు ఫోన్ చేయాలని సూచించారు.
స్థానిక ఎన్నికలకు సహకరించాలి
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, హోర్డింగ్‌లు, ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్‌ల్లో 48 గంటలో తొలగించాలని ఆదేశించారు. ఈ నెల 9న నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కలెక్టర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. కరపత్రాల ముద్రణలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఏ వ్యక్తి కూడా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు లేకుండా కరపత్రాలు ముద్రించకూడదని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమలు
కలెక్టర్ టీఎస్.దివాకర