
పండుగ వేళ.. ప్రజలు అప్రమత్తం
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో
మాట్లాడుతున్న డీఎస్పీ రవీందర్
ములుగు: సద్దుల బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ సూచించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. శనివారం ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌తో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్‌చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ప్రశ్న: గాంధీ జయంతి రోజున దసరా పండుగ ఉంది.. మద్యం అమ్మకాలపై చేపట్టే చర్యలు ఏంటి?
మొర్రి రాజుయాదవ్, మల్లంపల్లి
జవాబు: దసరా పండుగ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వస్తున్నందున ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణాలు బందు ఉంటాయి. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. దసరా వేడుకల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుంది. దసరా వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా స్థానిక యువత పోలీసులకు సహకరించాలి.
ప్రశ్న: దసరాకు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
చెర్ప రవీందర్, మేడారం
జవాబు: పండుగకు వెళ్లేవారు ఇంట్లో బంగారు ఆభరణాలు పెట్టి వెళ్లకుండా వెంట తీసుకెళ్లాలి. మేడారంతో పాటు ప్రతీ గ్రామంలో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. బతుకమ్మ ఆడేటప్పుడు నగలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు బతుకమ్మ ఆడే క్రమంలో అభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రశ్న: సద్దుల బతుకమ్మ రోజు చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తీసుకునే చర్యలేంటి?
పొదిల్ల చిట్టిబాబు, పస్రా
జవాబు: సద్దుల బతుకమ్మ రోజున మహిళలు బతుకమ్మలతో వెళ్తున్న క్రమంలో, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో మహిళలు ధరించిన బంగారు ఆభరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరణకు గురికాకుండా అనునిత్యం పోలీసులతో బందోబస్తు ఉంటుంది. ఆటలు ఆడే క్రమంలో అపహరణకు గురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
ప్రశ్న: సద్దుల బతుకమ్మకు పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంటుంది?
కందకట్ల రణధీర్, మల్లంపల్లి
జవాబు: సద్దుల బతుకమ్మ రోజున ప్రతీ గ్రామంలో పోలీసుల బందోబస్తు ఉంటుంది, మహిళా కానిస్టేబుళ్లతో పాటు మఫ్టీలో పోలీసులు కూడా విధుల్లో ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజున బంగారు నగలు ధరిస్తే అపహరణకు గురికాకుండా మహిళలు పినీస్‌తో పుస్తెలతాడుకు లింక్ చేసి నగలను ఉంచితే అపహరణకు గురయ్యే అవకాశం ఉండదు. బంగారు నగల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న: పండుగకు ఊరికెళ్తే.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రామిడి కరుణాకర్‌రెడ్డి, వెంకటాపురం(ఎం)
జవాబు: ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. దసరా పండుగకు ఊరికెళ్తే విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్‌లో భద్రపరుచుకోవాలి. ఇంటి పరిసరాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ పక్కన ఉన్న ఇంటివారికి ఊరికి వెళ్తున్న సమాచారం అందించి ఇంటిని చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.
ప్రశ్న: అనుమానాస్పద వ్యక్తులపై ఎలాంటి నిఘా ఉంటుంది. గ్రామాల్లో యువకులతో కమిటీలు ఏమైనా వేస్తారా?
గణపాక సుధాకర్, చల్వాయి
జవాబు: అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలి. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా జిల్లా ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిహిస్తున్నాం. గ్రామాల పరిధిలోని యువకులతో కమిటీలు వేసి గ్రామాల్లో నిఘా పెంచాలనే మీ ఆలోచనను పరిగణలోకి తీసుకుంటాం.
సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరి
గాంధీ జయంతి రోజు మద్యం అమ్మితే చర్యలు
‘సాక్షి ఫోన్ ఇన్’లో ములుగు
డీఎస్పీ నలువాల రవీందర్

పండుగ వేళ.. ప్రజలు అప్రమత్తం