
సొసైటీ పాలకవర్గాలపై వేటు
పదవీకాలం పొడిగింపులో ప్రభుత్వం కొత్త మెలిక
వెంకటాపురం(ఎం): సింగిల్ విండో సొసైటీల పాలకవర్గాలపై సహకార శాఖ చర్యలకు పాల్పడుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకొని సభ్యులు చెల్లించకపోవడంతో పాలకవర్గాన్ని బాధ్యులను చేస్తూ తొలగిస్తున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా ఇప్పటికే మూడు సొసైటీల పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్ ఇన్‌చార్జ్‌లను సహకార అధికారులు నియమించారు. జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేట, పాలంపేట పీఏసీఎస్ పాలకవర్గాలతో పాటు ఏటూరునాగారం పీఏసీఎస్ పాలకవర్గం రుణాలను రికవరీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని బాధ్యులను చేస్తూ పాలకవర్గాలను రద్దు చేశారు. దీంతో జిల్లాలోని మూడు పీఏసీఎస్‌లకు చెందిన ముగ్గురు చైర్మన్లు, ముగ్గురు వైస్ చైర్మన్లు, 33 మంది డైరెక్టర్లు పదవులు కోల్పోవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
రెండోసారి పొడిగింపులో ప్రభుత్వం మెలిక
ములుగు జిల్లాలో 12 పీఏసీఎస్‌లు ఉన్నాయి. పీఏసీఎస్‌లకు 15 ఫిబ్రవరి 2020లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడగించింది. పొడగించిన పదవీకాలం ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి మరో ఆరునెలల పాటు పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో పాలకవర్గాల పనితీరు బాగున్న సంఘాలను మాత్రమే పొడగించాలని, సొసైటీల అభివృద్ధికి పాటుపడని పాలకవర్గాలను రద్దు చేయాలని పేర్కొంది. ప్రధానంగా సొసైటీ పరిధిలో సభ్యులు తీసుకున్న రుణాల రికవరీపై దృష్టి సారించని పాలకవర్గాలపై చర్యలు చేపట్టాలని జిల్లా సహకార అధికారులను ఆదేశించింది. దీంతో సొసైటీల పనితీరు బాగాలేదని మూడు పాలకవర్గాలను రద్దు చేసి లక్ష్మీదేవిపేటకు ఎం.దేవేందర్‌రావు, పాలంపేటకు చంద్రశేఖర్‌రావు, ఏటూరునాగారానికి రాజేష్‌లను పర్సన్ ఇన్‌చార్జ్ లుగా అధికార యంత్రాంగం నియమించింది.
పీఏసీఎస్‌లలో సభ్యులు తీసుకున్న రుణాలను రికవరీ చేయకపోవడంతో పాలకవర్గాలు నిర్లక్ష్యం చేయడంతోనే సొసైటీలు నష్టాల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఏటూరునాగారం, లక్ష్మీదేవిపేట, పాలంపేట పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించాం. 12 సొసైటీల పనితీరును పరిశీలిస్తున్నాం. వీటిలో మరో రెండు సొసైటీల రికార్డులు పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. సొసైటీల నిర్వహణ సరిగా లేని పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగించవద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.
– సర్దార్‌సింగ్, జిల్లా సహకార అధికారి
సొసైటీల పనితీరు బాగుంటేనే
పొడిగించాలని ఉత్తర్వులు
జిల్లాలో 12 సొసైటీల్లో
3 పాలకవర్గాలు రద్దు
పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించిన అధికారులు