
వేతనం ఇవ్వకపోవడంతోనే మహేశ్ ఆత్మహత్య
ములుగు: మున్సిపల్ కార్మికుడు మైదం మహేశ్‌కు సకాలంలో వేతనం ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మృతికి బాధ్యత వహిస్తూ రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు మహేశ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5.50లక్షల ఆర్థిక సాయాన్ని అందించగా బీఆర్‌ఎస్ నేతలు బాధితుడి పిల్లల పేర్లపై పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేశారు. అనంతరం మాధవరావుపల్లిలో గల మహేశ్ కుటుంబ సభ్యులకు పోస్టల్ బాండ్‌ను మంగళవారం అందించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి, లక్ష్మణ్‌బాబు విలేకర్లతో మాట్లాడారు. మహేశ్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఐదు నెలల నుంచి వేతనం అందకపోవడం, మున్సిపాలిటీలో అధికారులను అడిగినా జీతం ఇవ్వకపోవడంతోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు మహేశ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవిందనాయక్, మాజీ జెడ్పీటీసీలు సకినాల భవాని, బేతెల్లి గోపాల్‌రెడ్డి, రుద్రమదేవి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి, లింగాల రమణారెడ్డి, నాయకులు పోరిక విజయ్‌రాంనాయక్, లకావత్ నరసింహనాయక్, తదితరులు పాల్గొన్నారు.
బాధితుడి కుటుంబానికి కేటీఆర్ రూ.5.50 లక్షల సాయం
పోస్టల్ బాండ్‌ను అందించిన
బీఆర్‌ఎస్ నేతలు