
పరిష్కారం ఏదీ?
గ్రీవెన్స్‌లో బాధితుల మొర
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లు రాలేదని ఒకరు, పింఛన్ మంజూరు చేయాలని వృద్ధుడు, ఉపాధి కల్పించాలని మరొకరు.. ఇలా జిల్లా వ్యాప్తంగా పలువురు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దివాకర దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 49 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సత్వర పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కాని దరఖాస్తులు అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
శాఖల వారీగా దరఖాస్తులు ఇలా..
ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణ శాఖ 13, భూ సమస్యలు 10, పెన్షన్ 9, ఉపాధి కల్పన 2, ఇతర శాఖలకు సంబంధించినవి 15 దరఖాస్తులు వచ్చాయి.
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో గిరిజనులు సమర్పించిన వినతులను పరిశీలించి వాటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడుతామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం 16 మంది గిరిజనుల నుంచి వినతులను స్వీకరించారు. ఏటూరునాగారం మండలం ఎస్టీ నాయకపోడు చెందిన గిరిజనులమని, గోదావరి నది ప్రాంతానికి దగ్గర ఉండడంతో వరదలు వస్తే ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని, తమకు ఇంటి స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం(కె) మండలం సీతారాంపురం గ్రామంలో రోడ్డు, పూసూరు వాగుపై కాజ్‌వే నిర్మించి రవాణా మార్గం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన గిరిజనుడు ఈఎస్‌ఎస్‌లో మంజూరు అయిన కెనరా బ్యాంక్‌లో సబ్సిడీ జమ అయిన డబ్బులను ఇవ్వడం లేదని, వాటిని ఇప్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం సర్వాయిగ్రామంలో సమ్మక్క సారలమ్మ గుడి వెళ్లే దారిని మరమ్మతు చేయాలని విన్నవించారు. తాడ్వాయి మండలం ఒడ్డుగూడెంలో త్రీఫేజ్ కరెంటు, వ్యవసాయ పంటలకు బోర్లు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఇలా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని పీఓకు విన్నవించారు. వినతులు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, జీసీసీ డీఎం వాణి, డీటీలు కిషోర్, అనిల్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 49,
ఐటీడీఏలో 16 వినతులు
స్వీకరించిన కలెక్టర్ దివాకర,
పీఓ చిత్రామిశ్రా
సత్వరమే పరిష్కరించాలని ఆదేశం