
నాణ్యమైన విద్యనందించాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాలలు, ఆశ్రమ, మోడల్, కేజీబీవీ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, మోడల్, కేజీబీవీల్లో నిత్యం విద్యాశాఖ అధికారులు తనిఖీ నిర్వహించాలన్నారు. వార్డెన్ నుంచి డీఈఓ వరకు విధులు సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏపీఓ వసంతరావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, గిరిజనశాఖ ఆర్సీఓ హరిసింగ్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సర్ధార్, అధికారులు పాల్గొన్నారు.
రేపు స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా
ములుగు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న వెలువరించడం జరుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు, చేర్పుల ఆనంతరం తుది జాబితాను వెలువరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, డీప్యూటీ ఈఓ రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర