
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
వాజేడు/వెంకటాపురం(కె): మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాల పరిధిలోని వాజేడు, పేరూరు, ఆలుబాక, పాత్రాపురం, మొర్రవానిగూడెం, వెంకటాపురం(కె)లోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈఎస్‌డీ నిబంధనల ప్రకారం కేంద్రాలను నడపాలన్నారు. ఆపరేటర్లు అందుబాటులో ఉండి మీ సేవ ద్వారా నిర్వహించే అన్ని రకాల సర్వీసులతో పాటు ఆన్‌లైన్ సర్వీసులను ప్రజలకు అందించాలని సూచించారు. రెండు మండలాల్లో ప్రజలు ఆధార్ సేవల పట్ల పడుతున్న ఇబ్బందులను గుర్తిస్తామని తెలిపారు. త్వరలోనే అదనపు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్ చేసే సమయంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ ఉన్నారు.
ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్