
ప్రభుత్వ బడులకు రేటింగ్
జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహం
పురస్కారంతో పాఠశాలల అభివృద్ధి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దేశవ్యాప్తంగా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుక వెళ్లనున్నారు. అయితే గతంలో ప్రభుత్వం స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నిలిచిపోవడంతో మళ్లీ జాతీయస్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు.
30వ తేదీ వరకు గడువు
జిల్లాలో 561 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్ కోసం ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు తదితర పాఠశాల నిర్వహణపై ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అక్టోబర్‌లో కమిటీ బృందం తనిఖీ చేపట్టనుంది. 3 స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 4 స్టార్ వచ్చిన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. లక్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2 స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3 స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4 స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5 స్టార్ కేటాయిస్తారు.
ఈ నెల 30వ తేదీ వరకు
దరఖాస్తుల స్వీకరణ
ఎంఈఓలకు, ఉపాధ్యాయులకు శిక్షణ
స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహణ బాగుపడనుంది. ఆయా బడుల్లో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సదుపాయం ఉన్నప్పటికీ వాటిని సరిగా వినియోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఈఓలతో పాటు మండలానికి ఒక్కో ఉపాధ్యాయుడికి బుధవారం జిల్లా కేంద్రంలోని ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇప్పించాం. మండల స్థాయిలో ప్రతీ పాఠశాల నుంచి ఒక ప్రధానోపాధ్యాయునికి అవగాహన కల్పించి పాఠశాలలో ఉండే అనేక వసతులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి పాఠశాల రేటింగును మెరుగుపరుచుకోవాలి. జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు రాష్ట్రస్థాయికి, జాతీయస్థాయికి ఎంపిక కావాలి.
– సిద్ధార్థ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ బడులకు రేటింగ్