
పారిశుద్ధ్య కార్మికుడి ఆత్మహత్య
ములుగు రూరల్: ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధి మాధవరావుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లికి చెందిన మైదం మహేష్(30)మూడేళ్లుగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తోటి కార్మికులకు వేతనం రాగా, తనకు ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో పలుమార్లు పంచాయతీ అధికారులను కలిశాడు. అయినా వేతనం ఇవ్వకపోవడంతో మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మైరుగైన వైద్యం కోసం అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.