
నిఘానీడలో..
9 మండలాల్లో 380 సీసీ కెమెరాలు
పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం
నేరగాళ్ల ఆటకట్టిస్తున్న పోలీసులు
ఏటూరునాగారం: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. నేరాలను నియంత్రించేందుకు మండల కేంద్రాలతోపాటు మారుమూల గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, మండల ప్రధాన రోడ్లు, కూడళ్లు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తూ నేరగాళ్ల ఆటను కట్టిస్తున్నారు ములుగు జిల్లా పోలీసులు. విద్యుత్ సరఫరా, ఓఎఫ్‌సీ, సోలార్ కనెక్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉన్న లేకున్నా నిరంతరం నడిచే విధంగా కావాల్సిన బ్యాటరీ బ్యాకప్, మెమరిలను అమర్చి రికార్డు అయ్యేలా చూస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 380 కెమెరాలను పోలీస్‌స్టేషన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో పోలీసులు ఛేదించిన కేసులు..
● ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన వ్యక్తిని ఓ ప్రేమ్‌నగర్ సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో బండారుపల్లి క్రాస్‌రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తించి ఆ వాహనాల డ్రైవర్లను పిలిచి విచారణ చేపట్టారు. ప్రమాదం చేసిన డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు.
● గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని ఆంజనేయస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయ పరిధిలో ఇటీవల చోరీ జరిగింది. పస్రా పోలీసులు ఆలయాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఒక టీం ఏర్పడి ఆ నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
● ఏటూరునాగారం సాయిబాబా దేవాలయంలో ఇటీవల చోరీ జరిగింది. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దొంగలను ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
సీసీ కెమెరాల పనితీరు ఇలా..
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను చూసి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై వాహన చట్టం ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. హైస్పీడ్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టారు. అలాగే, రామప్ప, మల్లూరు, లక్నవరం, బొగత, తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల, మేడారం సమ్మక్క–సారలమ్మ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద మాల్స్, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గోవులు, ఇసుక అక్రమ రవాణా, వేబ్రిడ్జి వద్ద తూకంలో తేడాలను సైతం గుర్తించేలా కెమెరాలు ఏర్పాటు చేశారు.
మత్తుపదార్థాల నియంత్రణ..
రాత్రి వేళ మత్తుపదార్థాలు రవాణా జరుగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలు, కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ఆకతాయిల వెకిలి చేష్టలను నియంత్రిస్తున్నారు. నిందితులకు తగిన పద్ధతిలో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. గంజాయి, కొకై న్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న కొన్ని బేకరీలను గుర్తించి కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి.
మూడో కన్నుతో పర్యవేక్షణ
ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్ల వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మూడో కన్నులాగా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లే విధంగా సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం. నిరంతరం పనిచేసేందుకు సోలార్ కెమెరాలను కూడా అమర్చాం. ఎలాంటి సంఘటనలు అయినా వెంటనే పసిగట్టేలా ఏర్పాట్లు చేశాం. ప్రజల రక్షణే మాకు ధ్యేయంగా పనిచేస్తాం.
– శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారం
నేరం చేస్తే తప్పించుకోలేరు
ములుగు జిల్లా మొదలు కొని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దు వరకు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నేరం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఒక ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలోనైనా సీసీ కెమెరాలకు చిక్కాల్సిందే. నక్సల్స్ ప్రాంతం కావడంతో మరింత కట్టుదిట్టంగా పక్కా ప్రణాళికతో కెమెరాలను ఏర్పాటు చేయించాం. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు అయినా వెంటనే పసిగట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం జరుగుతుంది. – శబరీష్, ఎస్పీ
మండలాల వారీగా ఏర్పాటు చేసిన కెమెరాలు
మండలాలు; కెమెరాలు
ఏటూరునాగారం; 42
మంగపేట; 54
తాడ్వాయి; 39
కన్నాయిగూడెం; 31
వాజేడు; 32
వెంకటాపురం(కె); 38
గోవిందరావుపేట; 39
వెంకటాపురం(ఎం); 40
ములుగు; 65
మొత్తం; 380

163 జాతీయ రహదారి వద్ద అమర్చిన సోలార్ కెమెరాలు