ఉల్లాస్‌.. నిరక్షరాస్యత ఖల్లాస్‌! | - | Sakshi
Sakshi News home page

ఉల్లాస్‌.. నిరక్షరాస్యత ఖల్లాస్‌!

Aug 8 2025 8:59 AM | Updated on Aug 8 2025 8:59 AM

ఉల్లాస్‌.. నిరక్షరాస్యత ఖల్లాస్‌!

ఉల్లాస్‌.. నిరక్షరాస్యత ఖల్లాస్‌!

ఉల్లాస్‌ ప్రారంభానికి సన్నాహాలు..

స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్‌లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్‌ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు.

విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం.

అక్షరాస్యత ఇలా..

స్వయం సహాయక సంఘాల్లోని నిరక్ష్యరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్‌లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు.

ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్‌ యాప్‌లో నమోదు చేస్తారు. మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్‌ కార్యకమ లక్ష్యంగా ఉంది.

టీచర్లకు శిక్షణ

ఉల్లాస్‌ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్‌ టీచర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్‌ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్‌రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కోఆర్డినేటర్‌ బద్దం సుదర్శన్‌రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్‌ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్‌, అలాగే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్‌ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్‌ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు.

సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు

నిర్లక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్‌ విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్‌, ఉల్లాస్‌ యాప్‌, ఎస్సీఆర్‌టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్‌ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్‌తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్‌ టీచర్లను కూడా ఎంపిక చేశారు.

వలంటీర్లతో విద్యాబోధన

మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్‌ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతీ ఏడాది మార్చి– సెప్టెంబర్‌ నెలలో జరిగే ఎన్‌ఐఓఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో పరీక్ష నిర్వహిస్తాం.

– టి.రమేశ్‌రెడ్డి,

వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌

నిరక్షరాస్యులైన మహిళల వివరాలు..

హనుమకొండ 28,904

వరంగల్‌ 29,739.

ములుగు 7,581

జనగామ 24,137

భూపాలపల్లి 29,484

నిరక్ష్యరాస్యులైన అతివలను అక్షరాస్యతవైపు

స్వయం సహాయక సభ్యులందరికీ చదువు

జిల్లాల్లో టీచర్లకు శిక్షణ కూడా షురూ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

1,61,613మంది నిరక్ష్యరాస్యుల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement