ఏటూరునాగారం: అడవుల్లో చెత్తాచెదారం వేయవద్దని, ప్లాస్టిక్‌ను నివారించాలని ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారం వరకు 163 జాతీయ రహదారికి ఇరువైపులా తన సిబ్బందితో కలిసి ప్లాస్టిక్, చెత్తాచెదారం సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుందన్నారు. అడవులు, నీరు, భూమి, గాలిని కాలుష్యం చేయకుండా నివారించేందుకు మనవంతు సాయంగా ప్లాస్టిక్‌ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నారాయణ, సెక్షన్ ఆఫీసర్ బాలాజీ, బీట్ ఆఫీసర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) సత్యనారాయణ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని ఇల్లంద్ క్లబ్‌హౌజ్‌లో గురువారం 18వ రక్షణ ట్రైపాక్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గని ప్రమాదాల్లో మరణించిన వారికి మౌనం పాటించి, రక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ భూగర్భ గనులలో వివిధ విభాగాలలో సీనియర్ ఉద్యోగులు కొత్త ఉద్యోగులకు మెళకువలు నేర్పించాలన్నారు. సింగరేణిలో జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంఎస్ ఉమేష్, డీఎంఎస్‌ఎస్ ఆనంద్‌వెల్, డీడీఎంఎస్ సనత్ కుమార్, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, రక్షణ జీఎం మధుసూదన్, వివిధ ఏరియాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో విఫలం : ఐఎన్‌టీయూసీ
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేటీకే 5వ గనిలో జరిగిన నిరసన కార్యక్రమానికి జోగు బుచ్చయ్య మాట్లాడారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
అండర్ గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్‌మెన్, ఈపి ఆపరేటర్లకు సర్ఫెస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 14వ తేదీన ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు, సంపత్ రావు, రాజేష్ ఠాకూర్, రవి, కిరణ్, అశోక్, అజీమ్, శ్రీనివాస్, నవీన్, కుమార్, రాము, సమ్మయ్య పాల్గొన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. సమగ్రమైన వివరాలతో పూర్తి సమాచారంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, శ్రీకాంత్, దేవేందర్, సుజాత, కవిత, స్వర్ణ, స్వాతి పాల్గొన్నారు.
నేడు కాళేశ్వరాలయంలో వరలక్ష్మీవ్రతాలు
కాళేశ్వరం: శ్రావణమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా (నేడు)సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

అడవుల్లో చెత్త వేయొద్దు