
వేతనాలు రాని ఉపాధి
మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టింది. ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వానికి, కూలీలకు వారధిగా ఉంటూ పనులు కల్పించడంలో ఈజీఎస్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే ఈ పథకంలో పనిచేసే సిబ్బంది వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 9 మండలాల పరిధిలో ఎఫ్‌ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు కలిపి 174 మంది పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌ఏలదే కీలకపాత్ర..
ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వంద రోజుల పాటు పనులు కల్పించడంలో ఎఫ్‌ఏ (ఫీల్డ్ అసిస్టెంట్లు)లు కీలకపాత్ర వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో పనులను గుర్తించి, కూలీలతో పనులు చేపిస్తూ, వారం రోజులకోసారి ఉపాధి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటారు. కూలీల హాజరు నుంచి డబ్బులు అందే వరకు ఎఫ్‌ఏలే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. గత మూడు నెలలుగా ఎఫ్‌ఏలకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరితో పాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి సైతం వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 గ్రామపంచాయతీల పరిధిలో 86,246 జాబ్‌కార్డులు ఉండగా 1,81,761 మంది కూలీలు పనిచేస్తున్నారు.
174 మంది ఈజీఎస్ సిబ్బంది..
జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌ఏలు 103 మంది, ఏపీఓలు 6, ఈసీలు 6, టీఏలు 29, కంప్యూటర్ ఆపరేటర్లు 30 మంది కలిపి మొత్తం 174 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రామాల్లో సంవత్సరానికి సరిపడా ఉపాధి పనులు గుర్తించి జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు పనులు కల్పిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు నూతనంగా గుర్తించిన పనులకు అంచనాలు వేయడం, పని ప్రదేశాల్లో కొలతలు వేయడం, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో మస్టర్లు పొందుపర్చడం, ఎఫ్‌ఏలకు మస్టర్లు ఇవ్వడం, నిధులు జనరేట్ చేయడం, ఈసీలు, ఏపీఓలు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఈజీఎస్ సిబ్బంది వాపోతున్నారు.
రూ.26వేల వేతనం అందించాలి..
ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ. 26వేలు అందజేయాలి. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎఫ్‌ఏలకు పే స్కేల్ అమలు చేసి అలవెన్స్‌లు వర్తింపజేయాలి. ఎఫ్‌ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
– పోలోజు రామాచారి,
ఫీల్డ్ ఆసిస్టెంట్ వెంకటాపురం(ఎం)
ప్రతినెలా వేతనాలు ఇవ్వాలి..
ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రతినెలా వేతనాలు అందించాలి. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారుతుంది. ఉపాధి హామీ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే వేతనాలు అందించి ఆదుకోవాలి. – రాజ్‌కుమార్,
టెక్నికల్ అసిస్టెంట్, ఎస్‌ఎస్ తాడ్వాయి
ఆర్థిక ఇబ్బందుల్లో ఎఫ్‌ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు
జిల్లాలో 174 మంది ఈజీఎస్ సిబ్బంది
భారమవుతున్న కుటుంబ పోషణ..
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలకు ఎఫ్‌ఏలు ఉపాధి పనులు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎఫ్‌ఏలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరితో పాటు ఇతర ఉద్యోగులు సైతం నిత్యం కార్యాలయానికి రావాల్సిందే. కానీ నెలనెలా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వేతనాలు రాని ఉపాధి

వేతనాలు రాని ఉపాధి

వేతనాలు రాని ఉపాధి

వేతనాలు రాని ఉపాధి