
బాల్యం.. భారం కాదు వరం
● బాలల ప్రొటెక్షన్ జిల్లా అధికారి హరికృష్ణ
ఏటూరునాగారం: బాల్యం.. భారం కాదని గొప్ప వరమని బాలల ప్రొటెక్షన్ జిల్లా అధికారి హరికృష్ణ అన్నారు. మండలం కేంద్రంలోని వివిధ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఒత్తిడిని నివారించి, జీవితంలో వారు ఉన్నతంగా ఎదిగేలా శాఖ పరిధిలో పనిచేస్తున్న కౌన్సిలర్లతో బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ‘బాల్యం పై భరోసా’ శీర్షికన శనివారం నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి, మహిళా సాధికారత కేంద్రానికి చెందిన కౌన్సిలర్లు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్య అనేది విజ్ఞానానికి మాత్రమే అని తెలిపారు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ఎలా బతకాలనేది తెలుపుతుందని వెల్లడించారు. విద్యార్థులు మార్కుల కోసం తపన పడవద్దని సూచించారు. తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేలా మంచి మార్పుల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒకరితో పోల్చుకుని జీవించకుండా పోటీ తత్వంతో ఎదిగేలా శ్రమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.