
చట్టాలపై అవగాహన తప్పనిసరి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్
ములుగు రూరల్: విద్యార్థులు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మికుల నిషేధిత చట్టం, ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టాలపై వివరించారు. విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమాదేవి, ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.