
ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు
ఏటూరునాగారం: ఎగువప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చే వాగులు, గోదావరి వరదలతో లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి భారీ వర్షాలు, వరదలు, సంసిద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ వరదలతో నష్టం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో గోదావరి, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, జంపన్నవాగు, రామప్ప, లక్నవరం పరీవాహక ప్రాంతాలతో పాటు కాల్వలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సహా ఆయా శాఖలు సన్నద్ధమై సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ముంపు ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి వరదలపై ఆయనకు వివరించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం, ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించి పలు వివరాలపై ఆరా తీశారు. వరదలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను ఆదేశించారు. అలాగే చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఏపీఓ వసంతరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, డీఈఈ నవీన్, తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, శ్రీనివాస్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
జంపన్నవాగు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై దృష్టిపెట్టాలి
కొండాయి బ్రిడ్జి, రామన్నగూడెంలోని గోదావరి పరిశీలన
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి శశాంక

ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు