
గిరిజన దర్బార్‌కు వినతుల వెల్లువ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనులు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఓ వసంతరావు వినతులను స్వీకరించారు. గిరిజనులు అందజేసిన 57 దరఖాస్తులను పీఓ ఆదేశాల మేరకు పరిశీలిస్తామని తెలిపారు. గిరిజన దర్బార్‌కు వచ్చిన పలు వినతుల వివరాలు ఇలా ఉన్నాయి.. వాజేడు మండలంలో జిల్లా డీఎంఎఫ్‌టీ ఫండ్స్ నుంచి పనిచేసిన బిల్లులు ఇప్పించాలని గిరిజనుడు ఏపీఓకు మొరపెట్టుకున్నారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కాల్వపల్లిలో సమ్మక్క–సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో అటెండర్‌గా పనిచేస్తున్నానని, ఏడాది వేతనం రావడం లేదని విన్నవించారు. భూపాలపల్లి జిల్లాలోని గుర్రంపేటలోని జీసీసీలో గోదాం అసిస్టెంట్‌గా, డ్రైవర్‌గా నాలుగేళ్లుగా పనిచేస్తున్నానని, తనను విధుల నుంచి తొలగించారని దీనిపై విచారణ చేపట్టి ఉద్యోగం ఇప్పించాలని బాధితుడు కోరారు. ఏటూరునాగారం మండలం గొత్తికోయగూడెం ఆదివాసీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు ఐటీడీఏ ద్వారా కేటాయించాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం గ్రామంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి విష పురుగులు, దోమలు వస్తున్నాయని, శానిటేషన్ పనులు చేయించడం లేదని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో డీడీ పోచం, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, డీడీ అనిల్, పోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వీకరించిన ఏపీఓ వసంతరావు