
డ్రగ్స్ నిషేధానికి యువత సహకరించాలి
ఏటూరునాగారం: డ్రగ్స్ నిషేధానికి యువత సహకరించాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రజలలో చైతన్యం తేవడానికి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత ను భాగస్వాములు చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వాటికి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు. గ్రామాలలో అక్రమంగా ఎవరైనా గంజాయి వంటి మత్తు మాదక ద్రవ్యాలను సరఫరా చేసినా, విక్రయించినా అటువంటి వారి ఆచూకీ తెలిపితే వారికి రూ.10 వేలు బహుమతి అందజేస్తామన్నారు. యువత పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
సమాచారం అందిస్తే
రూ.10వేలు బహుమతి
ఎస్పీ శబరీశ్