
వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల పేరిట టోకరా
ఖమ్మంక్రైం: ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న తనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో అందరూ తెలుసునని నమ్మించిన ఓ వ్యక్తి స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఖమ్మం కవిరాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన అనిల్ కొన్నేళ్ల క్రితం తన పేరు కేతన్ అని, ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నానంటూ ఖమ్మంతో పాటు జిల్లాలోని వాజేడు ప్రాంతానికి చెందిన పలువురితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వాజేడుకు చెందిన మహిళకు మొదట ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించాడు. ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడమే కాక ఆ మహిళ ద్వారా మరికొందరితో పరిచయం పెంచుకున్నాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆయన వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల మేర వసూలు చేశాడు. అయితే, నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోగా అనిల్ ఇంటికి వెళ్లి అడితే కుటుంబీకులు తమకు సంబంధం లేదని బదులిచ్చారు. దీంతో చేసేదేం లేక బాధితుల్లో కొందరు సోమవారం ఖమ్మం టూటౌన్ పోలీపులను ఆశ్రయించారు. కాగా, బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులే ఉండగా.. విచారణ చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.
రూ.4లక్షల నుంచి
రూ.ఐదు లక్షల వరకు వసూళ్లు
బాధితుల్లో ఖమ్మం,
ములుగు జిల్లా వాసులు