
పంటలకు ప్రాణం..
వెంకటాపురం(ఎం): వర్షాధారంగా సాగుచేసిన వేలాది ఎకరాల మెట్ట పంటలకు నాలుగు రోజులు కురిసిన వర్షాలు ప్రాణం పోశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. వరుణుడి కరుణతో జిల్లాలో వరినాట్లు సైతం జోరందుకున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో జిల్లాలో పత్తి 27,143 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 22,156 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. మొక్కజొన్న 6,009 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు అంచనాను మించి 8,365 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మిరప పంట 6,900 ఎకరాల్లో సాగు కానుండగా ఇప్పటివరకు రైతులు మిరపనారు పోశారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షంతో పత్తి పంటకు జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా వరినాట్లు
నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో అన్నదాతలు వరినాట్లపై దృష్టిసారించారు. జిల్లాలో ప్రధానంగా వరిపంటను రైతులు 1,30,117 ఎకరాల్లో వరిసాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు 17,598 ఎకరాల్లో వరినాట్లు రైతులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూముల్లో వర్షపునీరు నిలవడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకొని వరినాట్లు వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి వరిసాగుపై అన్నదాతలు ప్రధానంగా దృష్టి పెట్టారని అధికారులు వెల్లడిస్తున్నారు.
120 చెరువులు, కుంటలకు మత్తళ్లు
ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో 805 చెరువులు, కుంటలు ఉండగా సుమారు 120 చెరువులు, కుంటలు మత్తళ్లు పడినట్లు ఇరిగేషన్ డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా చెరువులు, కుంటలకు గండ్లు పడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప చెరువులోకి దేవాదుల నీటిని వారం రోజులుగా రెండు మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు దేవాదుల నీటితో 35 అడుగుల నీటిసామర్థ్యం గల రామప్ప సరస్సు ప్రస్తుతం 25 అడుగులకు చేరినట్లు వివరించారు. రామప్ప సరస్సు నుంచి ధర్మసాగర్ చెరువుకు నీటిని తరలిస్తున్నట్లు వెల్లడించారు.
వర్షాలు తగ్గాక
ఎరువులు వేయాలి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తితో పాటు ఆరుతడి పంటలకు మేలు చేస్తాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వరిసాగు జిల్లాలో పెరగనుంది. ఆగస్టు చివరి వారం వరకు వరినాట్లు వేసుకోవచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత పంటలకు ఎరువులు వేయాలి.
– సురేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
వర్షాలతో ఆరుతడి, మెట్ట పంటలకు జీవం
జిల్లాలో 805 చెరువులకు
120 చెరువుల మత్తళ్లు
వ్యవసాయ పనుల్లో రైతన్న బిజీబిజీ
ముమ్మరంగా వరినాట్లు

పంటలకు ప్రాణం..

పంటలకు ప్రాణం..

పంటలకు ప్రాణం..