
దేవాదులలో పంపింగ్ నిలిపివేత
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్ త్రీలోని నాలుగు మోటార్ల పంపింగ్‌ను అధికారులు ఆదివారం నిలిపివేశారు. కొన్ని రోజుల నుంచి పంపింగ్ వద్ద మూడు ఫేజ్‌ల్లో 10 మోటార్లు ఉండగా అందులో ఫేజ్ త్రీలో నాలుగు మోటార్లు, ఫేజ్ టూలో రెండు మోటార్లను ఆన్ చేసి, ఆరు మోటార్లతో పంపింగ్‌ను అధికారులు కొనసాగించారు. ఫేజ్ త్రీలోని నాలుగు మోటార్లను ఆప్‌చేసి ఫేజ్ టూలోని రెండు మోటార్లతో 494 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గొల్లబుద్దారాపు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు దేవా దుల డీఈ శరత్‌బాబు తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 80.85 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది.
సమ్మక్క సాగర్ గేట్ల ఎత్తివేత..
సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 6,05,340 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి 6,04,846 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 83 మీటర్లకు 80.20 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.