ములుగు రూరల్: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే పిడుగుపాటుకు సంకేతాలని వివరించారు. పిడుగుపాటుకు గురైన వారు ఎక్కువ శాతం చెట్ల కింది నిలబడడం, విద్యుత్ వైర్లకు అందుబాటులో ఉండడంతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పిడుగులు పడే సమయంలో లోహపు వస్తువులను వినియోగించడం, నీటిలో ఉండకూడదని వివరించారు. భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల పై కూర్చోవడం, మోకాళ్లపై చేతులు తలపెట్టుకొని ముడుచుకొని కూర్చుంటే పిడుగు పడిన సమయంలో విద్యుత్ ప్రభావం తక్కువగా పడుతుందని వెల్లడించారు. వర్షాల కారణంగా ప్రమాదాలు సంభవించినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 18004257109 కు సమాచారం అందించాలని కలెక్టర్ దివాకర సూచించారు.