
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వీసీలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
ములుగు రూరల్: ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారులదేనని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయం నుంచి సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్.ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి.మల్సూర్‌లతో కలిసి అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రస్థాయి అధికారులు ఆర్జేడీ జగన్, అన్ని జిల్లాల డీపీఆర్వ్‌లు తదితరులు పాల్గొన్నారు.
వేలం ఆదాయం రూ.6.46లక్షలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయ ఆవరణలో మంగళవారం కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు వేలం పాటలు నిర్వహించగా రూ.6.46లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించగా గతేడాది కంటే లక్షా 26 వేల ఆదాయం ఎక్కువగా సమకూరిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలకులు కవిత, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, సిబ్బంది సంతోష్, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా పాఠకుల హర్షం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మహిళా పాఠకులకు టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో మహిళా పాఠకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌ను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాంగణంలో టాయిలెట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మహిళా పాఠకుల అవస్థలను గమనించి టాయిలెట్స్ నిర్మించిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
రైతులపై పెరుగుతున్న దాడులు
గోవిందరావుపేట: జిల్లాలోని రైతులపై రోజురోజుకూ ఫారెస్ట్ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మ ల వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని పస్రాలో సీపీఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలకు లక్నవరం నీటిని అందించాలన్నారు. గోదావరిలోకి ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్కసాగర్ బ్యారేజీ జిల్లాలో ఉన్నప్పటికీ రైతులకు నీరు అందకపోవడం బాధాకరం అన్నారు. రేపు స్వాతంత్య్ర సమరయోధుడు, పార్టీ సీనియర్ నాయకుడు వీరపనేని రామదాసు వర్ధంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరా వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు చిట్టిబాబు, ఆదిరెడ్డి, రాజేష్, మల్లారెడ్డి, అశోక్, రాజు, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి