
వెదురు ప్లాంటేషన్‌కు మొక్కలు సిద్ధం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్లాంటేషన్ కోసం వెదురు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌ఆర్‌ఈసీఎస్ ఏపీఓ చరణ్‌రాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని మొక్కలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. 21వేల మొక్కలను ప్రత్యేకంగా మణిపూర్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. ఈ మొక్కలను మహిళా సంఘాల ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు కుటుంబాలకు సంబంధించి ప్రతీ ఏడాది రూ.లక్ష ఆదాయం వచ్చే విధంగా వారిని ప్రోత్సహించనున్నట్లు వివరించారు. ప్లాంటేషన్ ద్వారా నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం రావడానికి ప్రతీ రైతుకి 15 గుంటల భూమిలో 60 మొక్కలు నాటుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వెదురు మొక్కలు నాటే ఉద్దేశం ఉన్న వారందరికీ ఉచితంగా మొక్కలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కలు తీసుకోదలచిన వారు ఉపాధి హామీ జాబ్‌కార్డు, పట్టా జిరాక్స్, ఆధార్‌కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏపీఓ చరణ్‌రాజ్