
శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి
భూపాలపల్లి రూరల్/రేగొండ: శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి పోలీస్‌స్టేషన్, జిల్లా గంథ్రాలయం, వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కేంద్రాలు యువత తమపై తాము ఆధారపడేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. సింగరేణి, జెన్‌కో వంటి ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఈ కేంద్రాలు ఉపాధి కల్పన వేదికగా నిలవాలని చెప్పారు.