‘భూభారతి’తోనే సమస్యలు పరిష్కారం
ఏటూరునాగారం: భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై ప్రజలు, నాయకులు, రైతులకు శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంలో 14అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. దీంతో భూమితో ఉన్న సమస్యలు, తగాదాలు, గట్టు పంచాయతీలు కూడా తొలిగిపోతాయన్నారు. భూమి రిజిస్ట్రేషన్ ఇక నుంచి పారదర్శంగా ఉంటుందని వివరించారు. నిబంధనల ప్రకారమే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారని వివరించారు. అంతేకాకుండా భూమి పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు, మార్పులు చేర్పులు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత రైతుల వివరాలను సేకరించడంతో పాటు ఇరుగు పొరుగు వారి స్టేట్‌మెంట్ సైతం తీసుకుంటారని వివరించారు. చట్టంలో కీలకమైనది అప్పీలు వ్యవస్థ అని, ఎవరైనా రైతుకు అన్యాయం జరిగితే అప్పిల్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్‌ఏ స్థాయిలలో అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో గ్రామ పాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలను తగ్గించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూభారతితో ప్రజలందరికీ మేలు
కన్నాయిగూడెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రజలకు అన్నిరకాలుగా మేలు జరుగుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని రైతు వేదికలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణికి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టానికి ఉన్న తేడాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిద తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
‘భూభారతి’తోనే సమస్యలు పరిష్కారం


