కంట్రోల్ రూం ఏర్పాటు
ములుగు: ధాన్యం విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి పౌరసరఫరాల శాఖ డీఎం, జిల్లా అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉంటే 93474 16178 నంబర్‌కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో రూపంగా కూడా ఫిర్యాదు అందించవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిశు మరణంపై విచారణ
ములుగు: జిల్లా ఆస్పత్రిలో డెలివరీ సమయంలో గర్భంలోనే చిన్నారి మృతిచెందిన ఘటనపై శనివారం అదనపు కలెక్టర్ మహేందర్ జీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, వైద్యుల బృందం విచారణ చేపట్టింది. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ్ల రవళి గర్భంలోనే చిన్నారి మృతిచెందిన విషయంపై మంత్రి సీతక్క శుక్రవారం విచారణకు ఆదేశించారు. బృందం విచారణ చేపట్టంది. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని మహేందర్‌జీ తెలిపారు. పిల్లల వైద్య నిపుణులు సుధాకర్, మత్తు వైద్యులు భారతి, జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, డాక్టర్ శ్రీకాంత్, డీడబ్ల్యూఓ శిరీష, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్‌పతి, డాక్టర్ నాగన్వేష్, గణేష్ పాల్గొన్నారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీకోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్‌లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సిండగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్ష ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్ రోల్స్‌ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని పరీక్షల రాజేందర్ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూల్ కూడా విడుదల చేస్తామని వెల్లడించారు.


