బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తల్లిదండ్రులు అయ్యారు. తమకు మొదటి సంతానంగా మగబిడ్డ జన్మించినట్లు సోషల్‌మీడియాలో ప్రకటించారు. అభిమానులతో ఈ వార్తను పంచుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా కొత్త చాప్టర్‌లోకి అడుగుపెట్టిన ఈ జోడీ ఇలా పేర్కొంది. "మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మేము మా మగబిడ్డను స్వాగతిస్తున్నాము." అంటూ ఒక పోస్ట్ చేశారు. నవంబర్ 7న ఆసుపత్రిలో కత్రినా మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లితో పాటు బాబు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అని ప్రకటించిన తర్వాత ఈ జంటకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు. కత్రినా- విక్కీ కౌశల్‌కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇప్పుడు వారికి మగబిడ్డ జన్మించడంతో అనిరుధ్ మిశ్రాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది.


