
సీనియర్ గాయకుడు, నటుడు టీకేఎస్ నటరాజన్(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో టీకేఎస్ నాటక బృందంలో చేరి రంగస్థల నటుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన టీకేఎస్ నటరాజన్‌గా గుర్తింపు పొందారు. 1954లో రక్తపాశం చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
50 ఏళ్లలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. 1984లో శంకర్ గణేష్ సంగీత దర్శకత్వంలో వాంగ మాప్పిళ్‌లై వాంగ చిత్రంలో నటరాజన్ పాడిన ‘ఎన్నడీ మునియమ్మ ఉన్న కన్నుల మయ్యి’ పాటతో ఆయన మరింత ప్రాచుర్యం పొందారు. స్థానిక సైదాపేటలో నివసిస్తున్న ఈయన వృద్ధాప్యం కారణంగా బుధవారం ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. నటరాజన్ మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.
చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత